కేసీఆర్ జాతీయ పార్టీ.. అస్త్రం ఇదే !

ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిలించడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. అసలు తెలంగాణ ఉద్యమాన్నే అందరూ మర్చిపోయిన తర్వాత ఆయన రగిలించి.. రాష్ట్రాన్ని తీసుకు వచ్చారు. తన జాతీయ రాజకీయం కూడా తెలంగాణ ఉద్యమ తరహాలో ఉంటుందని కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు జాతీయ పార్టీ విషయంలో దక్షిణాది సెంటిమెంట్ తీసుకోబోతున్నారన్న చర్చ జరుగుతుంది. 

దక్షిణాదికి అన్యాయం జరుగుతోందనే భావన ఉంది. గణాంకాలతో సహా ఉన్న ఈ విషయం అందరికీ తెలిసిందే. పన్నుల వసూళ్లు ఎక్కువగా దక్షిణాది వైపు నుంచి వెళ్తూంటాయి. కానీ దేశం మొత్తానికి ఆ పన్నుల ఆదాయం పంచే క్రమంలో ఎక్కువగా ఉత్తరాదికే నిధులు వెళ్తూంటాయి. ఇప్పుడు దీన్నే కేసీఆర్ అస్త్రంగా మలుచుకో బోతున్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ గతంలో దక్షిణాదికి అన్యాయం జరిగిందని .. దక్షిణాది రాష్ట్రాలు కలిసి పెట్టుకున్న సమావేశాలకు హాజరు కాలేదు. కేంద్రాన్ని ప్రశ్నిద్దామని స్టాలిన్ లాంటి వాళ్లు రాసిన లేఖలకు స్పందించలేదు. అప్పుడు కనీసం మద్దతు ఇవ్వకుండా ఇప్పుడు దక్షిణాది కోసం పోరాటం అంటే ఎవరు నమ్ముతారు ? అన్నది చూడాలి. 

ఇక కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీ పేరు భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు.. టీఆర్ ఎస్ పార్టీ బీఆర్ ఎస్ లో విలీనం కాబోతుందని చెబుతున్నారు. ఈ నెలాఖరు లోగా పార్టీ ప్రకటన ఉంటుందని సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కాదు.. ఓ ఫ్రంట్ అనే ప్రచారం కూడా ఉంది. రాష్ట్రాల సమితిగా ఉండబోతుంది. కేంద్రం చేస్తున్న అన్యాయాలను నిలదీస్తే సమితిగా పురుడుపోసుకొని.. ఆ తర్వాత జాతీయ పార్టీగా టర్న్ తీసుకుంటుందని తెలుస్తుంది.