ఈసారి జవాన్ల కుటుంబాలకు చెక్కులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. బహుశా.. ఈ రెండు, మూడు రోజుల్లోనే పర్యటన ఉండొచ్చు. ఈ సారి కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంది. గాల్వన్ లోయ ఘర్షణలో చనిపోయిన వారికి కేసీఆర్ గతంలో పరిహారం ప్రకటించారు. ఎన్నికల సీజన్ ప్రారంభానికి ముందు పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రవాదుల దాడిలో మొత్తం 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఆ సంఘటన రాజకీయంగానూ కలకలం రేపింది. ఈ దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు తలా రూ. 25 లక్షల చొప్పున ప్రభుత్వం తరఫున సాయం అందించనున్నట్లు సీఎం అసెంబ్లీ వేదికగానే హామీ ఇచ్చారు.
మూడేళ్ళు దాటినా ఆ సాయం ఇప్పటికీ ఇవ్వలేదు. అసెంబ్లీలో ప్రకటన చేసిన మేరకు సాయం చేయరా అని అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో కేసీఆర్ను ప్రశ్నిస్తూ పోస్టులు కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నందున ఇలాంటి హామీలను బాకీ ఉంచుకోకూడదని.. తక్షణం అమలు చేసేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు జాబితా రెడీ చేసి కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఈ కుటుంబాలకూ పరిహారం చెక్కులు పంపిణీ చేసే అవకాశం ఉంది.