ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు ?

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దించబోతున్నారని సమాచారం. దీనిపై చర్చించడానికి కొద్దిసేపటి క్రితమే బీజేపీ పెద్దలు వెంకయ్య నాయుడితో సమావేశమయ్యారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు.  దాదాపు 50 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. 

 రాష్ట్రపతి ఎన్నికల కోసం పలువురు కేంద్ర మంత్రులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు సహా 14 మంది నేతలతో భాజపా ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతో జేపీ నడ్డా ఆదివారం భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పలువురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరు ముందు వరుసలో ఉంది. ఆయన పేరు దాదాపు ఖరారైనట్టేనని చెబుతున్నరు.

మరోవైపు, రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ప్రతిపక్ష పార్టీలు కూడా నేడు సమావేశం కానున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నేతృత్వంలో జరిగే ఈ భేటీలో యశ్వంత్‌ సిన్హాను విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. రాష్ట్రపతి రేసులో ఉండేందుకు సిన్హా కూడా సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన టీఎంసీ పార్టీకి కూడా రాజీనామా చేశారు.