వెంకయ్య నాయుడు ‘వర్సెస్’ యశ్వంత్‌ సిన్హా

రాష్ట్రపతి పదవి కోసం పోటీ పడే ప్రధాన అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. ఎన్డీఏ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు ఫైనల్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు, రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నేతృత్వంలో జరిగిన విపక్షాల భేటీలో  చర్చించాక‌  యశ్వంత్ సిన్హా పేరును కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ యశ్వంత్‌ సిన్హా పేరును ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు  జైరాం రమేష్ ప్రకటించారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక  ఓటింగ్‌ నిర్వహించనుండగా.. 21న ఓట్ల లెక్కింపు జరగనుంది.

1984లో ఐఏఎస్‌కు రాజీనామా చేసిన యశ్వంత్‌ సిన్హా జనతా పార్టీలో చేరారు. 1988లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో భాజపా జాతీయ అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు. 1998, 1999, 2009లో ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2002లో వాజ్‌పేయీ మంత్రివర్గంలో కేంద్ర విదేశాంగశాఖ మంత్రిగా పనిచేశారు. చంద్రశేఖర్‌ కేబినెట్‌లో ఏడాది పాటు (1998) కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సిన్హా బీజేపీ నుంచి బయటకు వచ్చి గతేడాది తృణమూల్‌లో చేరారు. తృణమాల్‌ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఈ ఉదయం ఆ పార్టీకి రాజీనామా చేశారు.