కోహ్లీ, రోహిత్ లకు స్ట్రాంగ్ వార్నింగ్
టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో (చివరి) టెస్టు జులై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌కు టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్ నిబంధనలేమీ లేకపోవడంతో.. టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లాండ్ లో స్వేచ్చగా విహరిస్తున్నారు. షాపింగ్ లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా పలకరించిన అభిమానులతో ఫోటోలు దిగుతున్నారు. షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. దీనిపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కనీస జాగ్రత్తలు పాటించకుండా ఆటగాళ్లు బయటి ప్రదేశాలకు వెళ్లడంపై బీసీసీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్‌ను తేలిగ్గా తీసుకోవద్దంటూ ఆ ఇద్దరి ఆటగాళ్లను హెచ్చరించాలని భావిస్తోంది. ‘యూకేలో కొవిడ్ కేసులు చాలావరకూ తగ్గినప్పటికీ క్రికెటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్‌లు ధరించే బయట తిరగాలి’ అని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ సూచించారు. యూకేలో ఇప్పటికీ రోజుకు 10వేల కొత్త కేసులు వస్తున్నాయి. ఒకవేళ ఆటగాళ్లకు కరోనా సోకితే ఐదు రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సిందే.