GST సమావేశంలో కీలక నిర్ణయాలు

ఆతిథ్య రంగం సహా వివిధ సేవలపై ఇస్తున్న మినహాయింపులను GST కౌన్సిల్‌ ఉపసంహరించుకుంది. రోజుకు రూ.1000లోపు ఛార్జ్‌ చేసే హోటల్‌ వసతిని పన్ను పరిధిలోకి తెచ్చింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షత చండీగఢ్‌ లో జరుగుతున్న జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందే రోగులు రూ.5వేల కన్నా ఎక్కువ ధర కలిగిన గదిపై 5శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.(ఐసీయూలకు మినహాయింపు). ఎన్వలప్‌ (పది గ్రాముల కన్నా తక్కువ బరువు ఉండాలి) మినహా అన్ని పోస్టల్‌ సేవలపైనా జీఎస్‌టీ వసూలు చేయనున్నారు. చెక్స్‌పై (విడిగా లేదా పుస్తకంగా ఉన్నా సరే) 18శాతం జీఎస్‌టీ వసూలు చేయాలని కౌన్సిల్‌ ప్రతిపాదించింది. వ్యాపార సంస్థలకు ఉండే నివాస సముదాయాల అద్దెలపై, ఈశాన్య రాష్ట్రాలకు బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణంపై ఇస్తున్న రాయితీని కూడా ఉపసంహరించుకుంది.  వ్యవసాయ ఉత్పత్తులు పాడవకుండా పొగ వేయటం, గోడౌన్‌లలో గింజలు, చెరకు, బెల్లం, కూరగాయలు, పత్తి, పూర్తిగా తయారు కాని పొగాకు, వక్క, కాఫీ, టీ ఉత్పత్తులపై జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చారు. ఇక తృణధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలపైనా సేవా పన్ను మినహాయించాలని జీఎస్‌టీ కౌన్సిల్‌ సూచించింది.