రూపాయి పతనం.. సామాన్యుడి బతుకు భారం !

అంతర్జాతీయ మార్కెట్ లో మన ‘రూపాయి’ ఇజ్జత్ కోల్పోతుంది. డాలరుతో పోలిస్తే దీని విలువ రోజు రోజుకూ దిగజారుతోంది. తాజాగా రూపాయి (Rupee value) విలువ జీవిత కాల కనిష్ఠానికి చేరింది. గురువారం స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి డాలరుతో రూపాయి విలువ 79.04కి పతనమైంది. రూపాయి పతనంతో సామాన్యుడు బతుకు భారంగా మారనుంది.  

రూపాయి విలువ క్షీణిస్తే నిత్యవసర సరుకుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వస్తు సేవలకు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. విదేశాల నుంచి దిగుమతయ్యే వంటనూనె, పప్పుదినుసులకూ అధిక ధరలు చెల్లించాలి. అంతర్జాతీయ వ్యాపారం డాలర్లలోనే జరుగుతుంది కాబట్టి, సరఫరా చేసిన దేశానికి డాలర్లలోనే చెల్లించాలి. రూపాయి విలువ క్షీణిస్తే ఈ చెల్లింపుల కోసం ఎక్కువ వ్యయమవుతుంది.  విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులపై భారం పెరుగుతుంది.


ఎవరికి లాభం అంటే ? 

తమ వస్తువులను, సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే రంగాలు మాత్రం క్షీణించిన కరెన్సీవల్ల లబ్ధి పొందుతాయి. ముఖ్యంగా భారత ఐటీ, ఫార్మా రంగాలకు ఈ పరిస్థితి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఒక డాలరుకు ఎక్కువ రూపాయలు అందుతాయి కాబట్టి రూపాయి క్షీణత వల్ల ప్రవాస భారతీయ కుటుంబాలు లాభపడతాయి.