మహా ఉత్కంఠ
మహా ఉత్కంఠ కొనసాగుతోంది. గురువారం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలంటూ గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆదేశాన్ని సవాల్ చేస్తూ ఠాక్రే సర్కారు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు వర్గాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఏ క్షణమైనా తీర్పు వెలువడే అవకాశం ఉంది.
గవర్నర్ ఆదేశాన్ని సవాల్ చేస్తూ దాఖలుచేసిన తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించగా.. ఠాక్రే ప్రభుత్వ అభ్యర్థనను మన్నించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలాలతో కూడిన వెకేషన్ బెంచ్.. ఈ సాయంత్రం 5 గంటలకు విచారణను ప్రారంభింభించిన విషయం తెలిసిందే. శివసేన తరఫున అభిషేక్ మను సింఘ్వీ, శిందే వర్గం తరఫున ఎన్‌కే కౌల్ తమ వాదనలు వినిపించారు.
ఏక్‌నాథ్ శిందే వర్గం ఎమ్మెల్యేల తిరుగుబాటుతో శివసేనలో తలెత్తిన సంక్షోభం.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ మనుగడకే ముప్పు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిందని.. అసెంబ్లీలో గురువారం తమ బలాన్ని నిరూపించుకోవాలంటూ ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించడం.. దీనిపై శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రేపేం జరగబోతోందన్న సస్పెన్స్ కొనసాగుతోంది.