మోడీ.. దేశానికి సేల్స్‌మెన్‌ !

 మోడీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. ప్రధానిగా కాకుండా.. దేశానికి సేల్స్‌మెన్‌గా మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు మద్దతుగా జలవిహార్‌లో నిర్వహించిన సభలో కేసీఆర్‌ మాట్లాడారు. మోడీ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు. టార్చిలైట్‌ వేసి వెతికినా మోదీ హామీలు నెరవేర్చినట్లు కనిపించవు. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయి. డీజిల్‌ సహా అన్ని ధరలు విపరీతంగా పెంచేశారని కేసీఆర్ మండి పడ్డారు.

మోడీ పాలనలో దేశ  ప్రతిష్ఠను మసకబారేలా చేశారు. ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేశారు. రైతులు, సైనికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. మోదీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. ప్రధానిగా కాకుండా.. దేశానికి సేల్స్‌మెన్‌గా మోదీ వ్యవహరిస్తున్నారు. మోదీ శాశ్వతంగా పదవిలో ఉంటానని అనుకుంటున్నారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదు.. మార్పు వచ్చి తీరుతుందని కేసీఆర్‌ అన్నారు. ప్రధాని ఇవాళ హైదరాబాద్‌ వస్తున్నారు. రెండ్రోజులు ఇక్కడే ఉంటారు.  ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వేసే ప్రశ్నలకు హైదరాబాద్‌ వేదికగా ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్‌ డిమాండ్ చేశారు.