ముర్మూకే శివసేన సపోర్ట్

రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. దానికి మరో ఉదాహరణ ఇదే. మహారాష్ట్రలో ఇటీవల ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఏక్‌నాథ్‌ శిందే శివసేన నుంచి తిరుగుబాటు చేయడం.. బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు వంటి కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించిన ముర్మూ కు శివసేన మద్దతు ఇవ్వడం అసాధ్యం, అసంభవం అనిపించొచ్చు. కానీ మర్మూకే శివసేన మద్దతు పకలబోతున్నట్టు సమాచారం.

ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని శివసేన కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో దిగిన ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం మాతోశ్రీలో సోమవారం పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ద్రౌపదికే మద్దతు ఇవ్వాలని ఎక్కువ మంది సభ్యులు కోరినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. శివసేనకు లోక్‌సభలో మొత్తంగా 18మంది ఎంపీలు ఉండగా.. వీరిలో 15మంది ఎంపీలు నిన్నటి సమావేశానికి నేరుగా హాజరయ్యారు. అయితే, వారంతా ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని ఠాక్రేను కోరినట్టు తెలిసిందే. దీంతో.. ఉద్ధవ్ వారి అభిప్రాయాన్ని కాదనలేని పరిస్థితి.