టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్
టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కానున్నాయి. శనివారం నిర్మాతలంతా కలిసి ఓ కీలకమైన సమావేశం ఏర్పాటు చేసుకొన్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో సమస్యల గురించీ, నిర్మాతలుగా తాము పడుతున్న కష్టనష్టాల గురించీ మాట్లాడుకొన్నారు. మూతబడుతున్న థియేటర్లు, పెరిగిపోతున్న హీరోల పారితోషికాలు, ఓటీటీ బెడద… ఇలా చాలా అంశాలపై చర్చ జరిగింది. ఇవన్నీ ఓ కొలిక్కి రావాలంటే.. సినిమా షూటింగుల్ని కొంతకాలం ఆపేసి, నిర్మాతలుగా తమ డిమాండ్స్ ఏంటో గట్టిగా వినిపించాలని తీర్మానించారు.
ఆదివారం కూడా మరోసారి ప్రొడ్యూసర్స్ గిల్డ్ వరుసగా రెండో రోజు సమావేశం అయింది.దస్ పల్లా హోటల్ లో జరిగిన ఈ సమావేశానికి ప్రస్తుతం నిర్మాణంలో వున్న సినిమాల నిర్మాతలు అందరూ హాజరయ్యారు. నిర్మాణ వ్యయం, నటీనటుల రెమ్యూనిరేషన్లు, నటీనటుల స్టాఫ్ తో సమస్యలు, అన్నీ చర్చకు వచ్చాయి. ఒక వారం రోజుల్లో షూటింగ్ లు ఆపాలన్న నిర్ణయం బలంగా తీసుకున్నారు. కానీ దీనిపై నిర్మాతలు అంతా వారి వారి అభిప్రాయాలు తెలియచేయడానికి రెండు రోజులు గడువు ఇచ్చారు. మొత్తం మీద టాలీవుడ్ నిర్మాణ వ్యయం ప్రక్షాళన దిశగా గట్టి అడుగులు పడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 1 నుంచి సినిమాల నిర్మాణాలు బంద్ పెట్టే అవకాశం వుంది.