పూరి-రౌడీ.. మూడో పాన్ ఇండియా ఫిల్మ్ ఫిక్స్

‘లైగర్’ కోసం తొలిసారి జతకట్టారు పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండ. వీరిద్దరికి ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో పూరి, రౌడీల మధ్య బంధం బాగా బలపడింది. ఎంతలా అంటే.. నాన్ స్టాప్ గా సినిమాలు చేసేంతగా. లైగర్ రిలీజ్ కాకముందే వీరి కాంబోలో మరో పాన్ ఇండియా షురూ అయిన సంగతి తెలిసిందే. జనగణమన తెరకెక్కుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటోంది. ఇంతలో వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమాపై ఫిక్సయింది.

ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ఈసారి విజయ్ కోసం పూరి ఓ సోషియో ఫాంటసీ కథ రాసుకున్నట్టు తెలిసింది. అది ‘జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి’, ‘యమ‌దొంగ‌` జోన‌ర్‌లో సాగుతుంద‌ని స‌మాచారం. జనగణన కంప్లీట్ కాగానే ముచ్చటగా మూడో పాన్ ఇండియా సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి తప్ప విజయ్ చేయాల్సిన మరో సినిమా లేదు. సుకుమార్ తో ఓ సినిమా చేయాల్సి ఉన్నా.. ఆయన పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నారు. 

పుష్ప 2 పూర్తయ్యేలోపు విజయ్ తో పూరి మరో మూడు సినిమాలు తీయగల సత్తా పూరికి ఉంది. ఆయన స్పీడు అలాంటిది. అందుకే.. పూరి-రౌడీ కాంబోలో మరో సినిమా రావడం పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. ఇది వరకు పూరి-రవితేజ కాంబోలో హ్యాట్రిక్ సినిమాలు వచ్చేవి. నిజానికి రవితేజని స్టార్ ని చేసింది పూరినే. ఇప్పుడు బాలీవుడ్ లో రౌడీ ని స్టార్ హీరో చేసే దాకా వదిలిపెట్టేలా లేడు.