తెలంగాణకు కేంద్రం మరో షాక్

ప్రతి విషయంలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుందని టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఫెల్యూర్ ప్రభుత్వమని కేంద్ర మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ఇలా ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకుంటూ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు కింద చేర్చడానికి అర్హత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 


లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు ఈమేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2016, 2018లో సీఎం కేసీఆర్‌.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కోరారని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేశారు. అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీ పరిశీలించాలి, హై పవర్‌ కమిటీ అనుమతిస్తే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంటుంది అని పేర్కొన్నారు. కాళేశ్వరానికి పెట్టుబడుల అనుమతులు కూడా లేవని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేయడం గమనార్హం.


గతంలో తెలంగాణ బీజేపీ నేతలు, బీజేపీ అగ్ర నేతలు కూడా స్వయంగా వారి నోటితో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. వివిధ సందర్భాల్లో దీనిపై ప్రజలను మభ్యపెట్టిన పరిస్థితులు చూశాం. అయితే ఇప్పుడు రాజకీయంగా బీజేపీ-టీఆర్ఎస్ మధ్య గ్యాప్ పెరగడంతో.. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కఠిన సమాధానం చెప్పినట్టు అర్థమవుతోంది. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాళేశ్వరం పంపు హౌస్ లోకి బురద మట్టి చేరన సంగతి తెలిసిందే. దాన్ని తిరిగి బాగు చేయడానికి రూ. 1000కోట్ల ఖర్చు అవుతుంది. దాదాపు ఏడాదిన్నర సమయం పడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం కేవలం రూ. 25 ఖర్చు అవుతుందని చెబుతోంది. మొత్తానికి.. ఓ వైపు కాళేశ్వరం ఇష్యూ నడుస్తున్న సమయంలోనే పుండు మీద కారం చల్లినట్టు కేంద్రం కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పడం గమనించవచ్చు.