తరానికొక ఆటగాడు బెన్‌స్టోక్స్‌

ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్‌స్టోక్స్‌ వన్డే కెరీర్ ముగిసింది. చివరి మ్యాచ్‌ ఆడేశాడు. దక్షిణాఫ్రికాతో తన సొంత మైదానం డర్హామ్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆడిన బెన్‌స్టోక్స్ (5) అటు బౌలింగ్ సహా బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. ఇదే తనకు ఆఖరు మ్యాచ్ అని స్టోక్స్ ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత స్టోక్స్ గొప్పతనం గురించి ఇంగ్లాండ్ కెప్టెన్‌ జోస్ బట్లర్ మాట్లాడారు. స్టోక్స్ ని తరానికొక ఆటగాడుగా అభివర్ణించాడు.

“తరానికొక ఆటగాడు బెన్‌స్టోక్స్‌. ఇక నుంచి స్టోక్స్‌ లేకుండా వన్డే మ్యాచ్‌లు ఆడటం సవాల్‌తో కూడుకొన్నదే. దాని కోసం ఇంకా ఎక్కువ కృషి చేయాల్సి ఉంది. టెస్టులకు ప్రాధాన్యం ఇవ్వడం బాగుంది. ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్‌కు తనే సారథి. తప్పకుండా టెస్టు ఫార్మాట్‌లో ఎక్కువ కాలం ఆడతాడని భావిస్తున్నా. టీ20ల్లోనూ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. మూడేళ్ల కిందట ప్రపంచకప్ ఫైనల్‌లో గెలిచి కప్‌ను సాధించడం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంలా చేశాడు. వన్డే క్రికెట్‌కు అద్భుతమైన రాయబారిగా నిలిచాడు. ఎల్లప్పుడూ వందశాతం కృషి చేసేవాడు” బట్లర్‌ వివరించాడు.