రాష్ట్రపతిగా ముర్ము.. కొన్ని రికార్డులు !
చరిత్రలో తొలిసారి అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ ఆసీనులుకానున్నారు. సంతాల్ ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపదీ ముర్ము తదుపరి రాష్ట్రపతిగా రైసినా హిల్ మెట్లెక్కబోతున్నారు. గురువారం వెలువడిన రాష్ట్రపతి ఎన్నిక ఫలితాల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఆమె ఘన విజయం సాధించారు. మొత్తం నాలుగు రౌండ్లలో లెక్కింపు జరగ్గా.. ఒక రౌండ్ మిగిలి ఉండగానే ఆమె 50శాతానికి పైగా ఓట్లు సాధించడం ద్వారా దేశంలో అత్యున్నత పీఠాన్ని దక్కించుకున్న తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించారు.
మొత్తంగా 4754 ఓట్లు పోలవ్వగా.. 53 ఓట్లు చెల్లుబాటు కానివిగా గుర్తించారు. చెల్లుబాటైన 4701 ఓట్లలో ద్రౌపదీ ముర్ము 2,824 ఓట్లు సాధించగా.. వాటి విలువ 6,76,803 అని రాజ్యసభ సెక్రటరీ జనరల్, రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ వెల్లడించారు. అలాగే, యశ్వంత్ సిన్హాకు 1,877 ఓట్లు రాగా.. వాటి విలువ 3,80,177. దీంతో ద్రౌపదీ ముర్ము నూతన రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు.
1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో జన్మించిన ముర్ము.. స్వతంత్ర భారతదేశంలో పుట్టి, రాష్ట్రపతి స్థానానికి చేరిన తొలివ్యక్తిగానూ మరో రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు రాష్ట్రపతులుగా ఉన్నవారంతా 1947కి ముందు పుట్టినవారే. ఇక రాష్ట్రపతి పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలు కూడా ఈమే కావడం విశేషం. ప్రస్తుతం ఆమె వయసు 64 సంవత్సరాలు.