రాష్ట్రపతి పీఠమెక్కిన తొలి గిరిజన మహిళ

భారత రాష్ట్రపతి పీఠమెక్కిన తొలి గిరిజన మహిళగా  ద్రౌపదీ ముర్ము చరిత్ర సృష్టించబోతున్నారు. రాష్ట్రపతి ఎవరన్నది మరికొద్ది సేపట్లో తేలనుంది. గురువారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ భవనంలో రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం వెలువడే అవకాశాలున్నాయి. అయితే ముర్ముకు మెజార్టీ ఉండటంతో ఆమె విజయం లాంఛనమేనని తెలుస్తోంది.

ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ఈనెల 24తో ముగుస్తుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు. ఫలితాలను ప్రకటించగానే ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ద్రౌపదీ ముర్మును కలిసే అవకాశాలున్నాయి. మరోవైపు ముర్ము స్వస్థలంలో భారీ సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మయూర్‌భంజ్‌లోని రాయ్‌రంగ్‌పూర్‌ పట్టణంలో ఇప్పటికే పెద్ద పెద్ద హోర్డింగ్‌లు వెలిశాయి. జానపద కళాకారులు, గిరిజన నృత్యకారులు ఇప్పటికే వీధుల్లోకి చేరి ప్రదర్శనలు ఇస్తున్నారు.