ఈడీ ముందుకు సోనియా, తోడుగా ప్రియాంక

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు. సోనియా ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమెకు తోడుగా ఉండేందుకు ప్రియాంకకు ఈడీ అనుమతినిచ్చింది. అయితే విచారణ గదిలో కాకుండా మరో గదిలో ఉండాలని సూచించింది. కోవిడ్ లక్షణాలతో సోనియా ఇటీవల ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. వైరస్‌ నుంచి కోలుకున్నప్పటికీ.. కొవిడ్‌ అనంతర సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. ప్రతి మూడు నాలుగు గంటలకోసారి నెబ్యులైజేషన్‌ తీసుకోవాల్సిన అవసరం ఉండటంతో ప్రియాంకను ఈడీ కార్యాలయం లోపలికి అధికారులు అనుమతించారు.

అదనపు డైరెక్టర్‌ స్థాయి మహిళా అధికారి నేతృత్వంలో ఐదుగురు అధికారులు బృందం సోనియాను ప్రశ్నించనున్నారు. సోనియాను  దర్యాప్తు సంస్థలు విచారించడం ఇదే తొలిసారి. రాహుల్‌ గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చి కాసేపటి తర్వాత వెళ్లిపోయారు. మరోవైపు సోనియాను ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడుతోంది. రాజకీయ ప్రతీకారంలో భాగంగానే దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని పార్టీ ఆరోపిస్తోంది.