ఇంజినీర్లు చెప్పినా కేసీఆర్ వినలేదు
ఇంజినీర్లు చెప్పినా సీఎం కేసీఆర్ వినకపోవడం వల్లే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చర్చలో భాగంగా ఈటల మాట్లాడుతూ.. రూ.వేల కోట్ల విలువైన పంప్ హౌస్‌లు వరద నీటిలో మునిగిపోయాయని.. అయినా, ఎంతో అనుభవం ఉన్న ఇంజినీర్లు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. రూ.వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇంజినీర్లు శాశ్వత చర్యల గురించి ఆలోచన చేయాలన్నారు.
నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ బాధ్యత లేకుండా.. ఇంత పెద్ద ఎత్తున వరదలు వస్తే విదేశాలకు వెళ్లారు. నీటిపారుదల శాఖ సీఎం పరిధిలో ఉంది. అధికారులేమో ఇలా పని చేస్తున్నారు. 139 టీఎంసీల నీరు ఎత్తిపోస్తే రూ.3వేల కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు శ్రీరామరక్ష కాదన్నారు. ఒక్కసారి ముంపునకు గురైతే.. పదేళ్లు అయినా కోలుకోలేరని ఈటల అన్నారు.