శివసేన ఎవరిది ? తేల్చుకోండి.. ఈసీ ఆదేశం !
మహారాష్ట్రలో శివసేనను అధికారం నుంచి దూరం చేశారు ఆ పార్టీ తిరుగుబాటు నేత ఏక్ నాథ్ శిండే. ఇప్పుడు పూర్తిగా పార్టీని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే , ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే మధ్య నెలకొన్న పోరు ఇప్పుడు ఎన్నికల సంఘానికి చేరింది. అసలైన శివసేన తమదేనని, ఆ పార్టీ నియంత్రణను తమకు అప్పగించాలని కోరుతూ ఇటీవల శిందే నేతృత్వంలోని చీలిక వర్గం ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. శివసేన పార్టీ కోసం మెజార్టీ నిరూపించుకోవాలంటూ ఈసీ ఇరు వర్గాలను ఆదేశించింది. అందకు సంబంధించిన పత్రాలను ఆగస్టు 8వ తేదీలోగా సమర్పించాలని సూచించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 56 స్థానాల్లో గెలిచింది. వీరిలో దాదాపు 40 మంది శిండే వెంట వెళ్లారు. ఇక 18 మంది ఎంపీలు ఉన్న శివసేన నుంచి ఇటీవల 12 మంది శిండే శిబిరంలోకి జంప్ అయ్యారు. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ శిండే వర్గం సొత్తు కానుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదేమో.. !