రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణం

నూతన రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. సంప్రదాయ సంతాలీ చీరలో ఆమె ప్రథమ పౌరురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము తొలిసారి ప్రసంగించారు.

“ఒడిశాలోని ఓ మారుమూల ఆదివాసీ గ్రామంలోని పేద కుటుంబం నుంచి వచ్చిన నేను దేశ అత్యున్నత పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తున్నా. ఇది నా వ్యక్తిగత విజయం మాత్రమే కాదు.. దేశ పేద ప్రజలందరికీ దక్కిన విజయం. ఈ దేశంలో పేదలు కూడా కలలు కనొచ్చని, వాటిని సాకారం చేసుకోవచ్చని చెప్పేందుకు నా నామినేషనే ఓ రుజువు. నాకు ప్రాథమిక విద్య చదువుకోవడమే ఓ కలగా ఉండేంది. అలాంటి స్థాయి నుంచి ఇక్కడి దాకా రాగలిగాను” అని ముర్ము ఆనందం వ్యక్తం చేశారు.

ఈ వేడుకలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, దౌత్య కార్యాలయాల అధిపతులు/ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.