వన్డేలను 40 ఓవర్లకు కుదిస్తారా ?
ఇప్పుడంతా ధనాధన్ ఆట దే హవా. టీ20 మ్యాచ్ లు ప్రేక్షకులకి మస్త్ మజా పంచుతున్నాయి. ఈ నేపథ్యంలో వన్డేలు, టెస్టులకు రోజురోజుకి ఆదరణ కరువవుతోంది. ముఖ్యంగా వన్ డే మ్యాచ్ లు మునుపటిలా ఆసక్తిగా చూడటం లేదు. అందుకే వన్ డేలను 40 ఓవర్లకు కుదించాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. పాక్ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ స్పందిస్తూ వన్డే మ్యాచ్‌లను వినోదభరితంగా మార్చాలంటే వాటిని 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు కుదించాలన్నారు. అఫ్రిదీ అభిప్రాయాన్ని రవి శాస్త్రి సమర్థించారు. మ్యాచ్ వ్యవధిని తగ్గించడం వల్ల వన్డేలకు ఎలాంటి హానీ ఉండదన్నారు.
“1983లో మేం ప్రపంచ కప్ గెలిచిప్పుడు కూడా 60 ఓవర్ల వన్డేలు ఆడాం. ఆ తర్వాత 60 ఓవర్లు చాలా ఎక్కువ సమయం అని భావించారు. అందుకే వాటిని 50 ఓవర్లకు తగ్గించారు. అప్పటి నుంచి 50 ఓవర్లతో వన్డేలు ఆడుతున్నారు. సుదీర్ఘకాలంగా ఇదే ఫార్మాట్‌లో వన్డేలు కొనసాగుతున్నందున ఇప్పుడు దీన్ని ఎందుకు మార్చకూడదు? ప్రస్తుత పరిస్థితుల్లో 50 ఓవర్లు చాలా ఎక్కువే. అందువల్ల ముందుచూపుతో, సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది. వన్డేలను 40 ఓవర్లకు తగ్గించాలి. అప్పుడే ఈ ఫార్మాట్‌ను కొనసాగించగలం” అని శాస్త్రి చెప్పుకొచ్చారు.