రాజగోపాల్ రెడ్డి కి షాక్ ఇస్తున్న కార్యకర్తలు

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. మంగళవారం తన నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన పార్టీని వీడే సంకేతాలను ఇచ్చారు. నాంపల్లి, మర్రిగూడ, చండూరు మండలాల ముఖ్య కార్యకర్తలు, నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. తన రాజకీయ భవిష్యత్తు కార్యకర్తల చేతుల్లోనే ఉందన్న రాజగోపాల్‌రెడ్డి…కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకే తాను భాజపాలో చేరుతున్నానని స్పష్టం చేసినట్లు సమాచారం.

అయితే కార్యకర్తల నుంచి మిక్సిడ్ టాక్ వచ్చినట్టు తెలిసింది. కాంగ్రెస్‌లోనే ఉండి తెరాసపై పోరాడాలని కొంతమంది సూచించగా…   నియోజకవర్గంలో భాజపా సంస్థాగతంగా బలంగా లేదని, ఈ పరిస్థితుల్లో పోటీపై పునరాలోచించుకోవాలని మరికొందరు చెప్పినట్లు తెలిసింది. మరికొంతమంది మీ నిర్ణయం మేరకు పనిచేస్తామని చెప్పగా.. వారం రోజుల్లో మరోసారి సమావేశం అవుదామని చెప్పి పంపించారని తెలిసింది. వాస్తవానికి దాదాపు రెండేళ్ల క్రితమే రాజగోపాల్ రెడ్డి కమలం పాట పాడారు. కానీ స్థానిక నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనకడుగు వేశారు. ఇప్పుడు ఎన్నికలు సమీస్తున్న వేళ బీజేపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. శ్రావణ మాసం ప్రారంభం కాగానే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక ఉంటుందని సమాచారం.