అల్‌ఖైదా చీఫ్‌ అల్‌-జవహరీ హతం

అల్‌ఖైదా చీఫ్‌ అల్‌-జవహరీని హతమయ్యాడు. అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో జరిపిన డ్రోన్‌ దాడిలో జవహరీని అంతమొందించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధికారికంగా ప్రకటించారు. సోమవారం సాయంత్రం బైడెన్‌ శ్వేతసౌధం నుంచి ప్రత్యేక ప్రసంగం చేసి ఆపరేషన్‌ వివరాలను వెల్లడించారు. 9/11 మృతుల కుటుంబాలకు న్యాయం జరిగిందని బైడెన్‌ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రజలకు హాని కలిగిస్తే దాక్కున్నా మట్టుబెడతామని హెచ్చరించారు.

ఈ ఆపరేషన్‌ కోసం అమెరికా పెద్ద కసరత్తే చేసింది. జవహరీ దినచర్యను దగ్గరుండి పరిశీలించేందుకు ఓ అధికారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. బాల్కనీలో నిల్చున్నది జవహరీ అని ఆ అధికారి నిర్ధారించిన తర్వాతే దాడి చేసింది. ఆపరేషన్‌ సమయంలో జవహారీ భార్య, కుమార్తెలు, మనవళ్లు అంతా అదే భవనంలో ఉన్నారట. కేవలం జవహరీ మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్‌ చేపట్టడంతో భవనంలోని ఒక అంతస్తు మాత్రమే ధ్వంసమైంది. ప్రపంచంలో మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుల్లో జవహరీ ఒకడు. లాడెన్‌ హతమైన తర్వాత అల్‌ఖైదా పగ్గాలను జవహరీ చేపట్టాడు. 2001 సెప్టెంబర్‌ 11న అమెరికాపై జరిపిన ఉగ్రదాడుల ఘటనలో లాడెన్‌తో పాటు ఇతడు కూడా ప్రధాన సూత్రధారి. అతడిపై అమెరికా 25 మిలియన్‌ డాలర్ల రివార్డు కూడా గతంలో ప్రకటించింది.