నెక్ట్స్ సీజేఐగా జస్టిస్‌ లలిత్‌

ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఈ నెల 26వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. సంప్రదాయం ప్రకారం సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌  పేరును ఎన్‌.వి. రమణ  సిఫార్సు చేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు.

సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ లేఖను కేంద్ర న్యాయశాఖ.. ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపనుంది. ఆయన ఆమోదం తర్వాత రాష్ట్రపతికి చేరుకుంటుంది. అంతిమంగా రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు.  దేశంలోనే తీవ్ర సంచలనం సృష్టించిన త్రిపుల్‌ తలాక్‌ సహా అనేక కీలక కేసుల్లో తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్‌ యు.యు. లలిత్‌ ఉన్నారు.

1957 నవంబరు 9న జన్మించిన ఆయన జూన్‌ 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. డిసెంబరు 1985 వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. జనవరి 1986 నుంచి తన ప్రాక్టీసును సుప్రీంకోర్టుకు మార్చారు. ఆగస్టు 13, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నాటి నుంచి అనేక కీలక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు.