మెగా గెలుకుడుపై కొరటాల పంచ్ డైలాగ్
టాలీవుడ్ టాప్ దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ‘ఆచార్య’ ముందు వరకు ఆయన అపజయం ఎరుగని డైరెక్టర్ గా నీరాజనాలు అందుకున్నారు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అను నేను సినిమాలు దేనికదే ప్రత్యేకమైనవి అనిపించుకున్నాయి. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి తో చేసిన ‘ఆచార్య’ అట్టర్ ప్లాప్ అయింది. దీంతో కొరటాల ఇమేజ్ డ్యామేజ్ అయింది. అయితే ఈ సినిమా విషయంలో మెగా గెలుకుడు ఎక్కువైంది. అందుకే కథ పాడైంది అనే వార్తలు వినిపించాయి. దీనిపై కొరటాల నేరుగా ఆరోపణలు చేయలేని పరిస్థితి. అందుకే తన కలం బలంతో దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇది ఆయన సినిమా ద్వారా ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్న కృష్ణమ్మ సినిమా ద్వారా మెగా పంచ్ ఇచ్చినట్టు అర్థమవుతోంది.
వి.వి. గోపాల కృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కృష్ణమ్మ’. కొరటాల శివ సమర్పిస్తున్నారు. కొమ్మలపాటి కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను గురువారం హీరో సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశారు. యాక్షన్ అంశాలకు ప్రేమ, స్నేహాన్ని జోడిస్తూ ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా టీజర్ చూస్తే అర్థమవుతుంది. ముగ్గురు స్నేహితులు తమకు ఎదురైన సమస్యలను ఎలా ఎదుర్కొన్నారన్నది ప్రజెంట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా టీజర్ లో ‘కథ నడక, నది నడత ప్రశాంతంగా సాగిపోవాలంటే ఎవ్వడూ గెలక్కూడదూ.. సత్యదేవ్ చెప్పే డైలాగ్ ఒకటి ఉంది. అది ఆచార్య సినిమా విషయంలో మెగా గెలుకుడును దృష్టిలో పెట్టుకునే కొరటాల ఉంచారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. త్వరలోనే ‘కృష్ణమ్మ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.