కొత్త ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వాపై 346 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. మొత్తం 725 ఓట్లు పోలవ్వగా.. ధన్‌ఖడ్‌కు 528, మార్గరెట్ ఆళ్వాకు 182 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు.  దేశ 16వ ఉప రాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా కితానా గ్రామానికి చెందిన జగ్‌దీప్‌.. యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చుకున్న తర్వాత రాజస్థాన్‌ హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా పనిచేశారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. 1990లో కేంద్రమంత్రిగానూ వ్యవహరించారు. 1993-98 మధ్య అజ్‌మేర్‌ జిల్లాలోని కిషన్‌గఢ్‌ స్థానం నుంచి ఎమ్మెల్యేగా రాజస్థాన్‌ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు. 2019 నుంచి పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా కొనసాగుతున్నారు.