టీమిండియాలో ఏడుగురు కెప్టెన్లు.. మంచిదే !

ఈ ఏడాది టీమిండియాకు ఏడుగురు కెప్టెన్సీ బాధ్యతలు వహించాల్సి వచ్చింది. విరాట్‌ కోహ్లీ అనంతరం రోహిత్‌ శర్మ మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా మారగా.. అతడు లేని సందర్భంలో కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, బుమ్రా, శిఖర్‌ ధావన్‌ జట్టుకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. దీనిపై  రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. జట్టులో చాలా మంది నాయకులు ఉండటం ఎంతో అద్భుతంగా ఉందన్నారు. నిజాయితీగా చెప్పాలంటే.. ఈ కుర్రాళ్లు ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకుంటుండంతో.. నా పని కూడా కాస్త తగ్గుతుందన్నారు.

ఇక వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగులుండగానే భారత్‌ సొంతం చేసుకుంది. శనివారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రిషభ్‌పంత్‌ 44 (31 బంతుల్లో 6×4), రోహిత్‌ శర్మ 33 (16 బంతుల్లో 2×4,3×6), సంజూ శాంసన్‌ 30 నాటౌట్‌ (23 బంతుల్లో 2×4,1×6), సూర్య కుమార్‌ 24 (14 బంతుల్లో 1×4,2×6) దీపక్‌ హుడా 21 (19 బంతుల్లో 2×4), అక్షర్ 20నాటౌట్‌ (8 బంతుల్లో 1×4,2×6) రాణించారు. అనంతరం వెస్టిండీస్‌ 132 పరుగులకే ఆలౌట్ అయింది. విండీస్ బ్యాటర్లలో రోవ్‌మన్‌ పావెల్‌ (24), నికోలస్‌ పూరన్( 24) మినహా మిగతా వారెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.