బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా
ఊహించిందే జరిగింది. బీజేపీకి జేడీయూ బ్రేకప్ చెప్పేసింది. అంతేకాదు.. బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్ ను కలిసి నితీశ్ కుమార్ రాజీనామా సమర్పించారు. ఆర్జేడీ తో కలిసి నితీశ్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
బీజేపీ నుంచి తన రాజకీయ మనుగడకు ముప్పుందని భావిస్తున్న నీతీశ్.. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలనే యోచనలో ఉన్నట్లు గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జేడీ(యు) ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం ఈ ఉదయం సమావేశమయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు చర్చించారు. బీజేపీతో జేడీ(యు) పొత్తు ముగిసిందని ఈ సందర్భంగా నీతీశ్ పార్టీ నేతలకు చెప్పారు. ఆ వెంటనే గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు.
నితీశ్ సీఎంగా కొనసాగేందుకు తాము మద్దతిస్తున్నామని తెలుపుతూ ఆర్జేడీ నేతలు లేఖపై సంతకాలు చేశారు. ఈ లేఖను గవర్నర్‌కు అందించే అవకాశాలున్నాయి. అయితే కొత్త పొత్తులో భాగంగా తనకు హోంశాఖ కేటాయించాలని తేజస్వీ యాదవ్.. నీతీశ్‌ను కోరినట్లు సమాచారం. బిహార్‌లో మొత్తం 243 మంది శాసనసభ్యులున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 122 మంది సభ్యుల మద్దతు అవసరం. పార్టీల వారీగా చూస్తే.. జేడీ(యు) – 45, భాజపా -77, ఆర్జేడీ – 79, కాంగ్రెస్ – 19, వామపక్షాలు – 16, ఏఐఎంఐఎం – 1, హెచ్‌ఏఎం – 4 స్వతంత్రులు – 2 ఉన్నారు.