జనసేనలో చేరిక.. క్లారిటీ ఇచ్చిన బాలినేని !

వైకాపా కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్తున్నారనే ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది. అది నిజమే అన్నట్టుగా.. చేనేతల గురించి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌ చేస్తే.. దానికి బాలినేని మద్దతు ప్రకటింటించారు. అంతేకాదు.. గిద్దలూరు నియోజకవర్గంలో స్థానిక నేతలతో ఆయన చర్చలు జరపడంతో.. ఇది పార్టీ మారే క్రమంలో చేసే కసరత్తు అనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా బాలినేని స్పందించారు. జనసేనలో చేరడంపై క్లారిటీ ఇచ్చారు.

ఊసరవెల్లి రాజకీయాలు చేయను. తనకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్‌ఆర్‌.. ఎన్నికష్టాలు ఉన్నా సీఎం జగన్‌ వెంటే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్‌తోనే ఉంటానని.. వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు. వైకాపా రీజినల్‌ కోఆర్డినేటర్‌గా 22 నియోజకవర్గాల బాధ్యతలు తనకు అప్పగించారని.. అక్కడ గెలుపుకోసం కృషి చేస్తానని చెప్పారు.