తాటి కల్లు తాగిన బండి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’ కొనసాగుతోంది. నకిరేకల్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన.. స్థానికులతో మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. సుంకెనాపల్లి నుంచి చిట్టెడుగూడెం మీదుగా యాత్ర సాగుతోంది. మార్గంమధ్యలో కల్లుగీత కార్మికుల సమస్యలను సంజయ్‌ తెలుసుకున్నారు. అంతేకాదు.. గౌడ్ అప్పుడే తాటి చెట్టు ఎక్కి తీసుకొచ్చిన కల్లును తాగారు. ఓ దమ్ పట్టిన తర్వాత పాదయాత్రను కంటిన్యూ చేశారు.

ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. టీఆర్ఎస్  ప్రభుత్వం  50శాతానికి పైగా ఉన్న బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణిచివేస్తోందని ఆరోపించారు. బీసీల సంక్షేమానికి బడ్జెట్‌లో నామమాత్రంగా నిధులు కేటాయిస్తూ.. వాటిలోనూ 10శాతం కూడా ఖర్చు పెట్టడం లేదని మండిపడ్డారు. బీసీ సబ్‌ ప్లాన్ తెస్తామని 2017 బడ్జెట్‌ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు తీసుకురాలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో సగానికి పైగా బీసీ జనాభా ఉంటే.. అసెంబ్లీలో కేవలం 22 మంది సభ్యులు, మంత్రి వర్గంలో కేవలం ముగ్గురు మంత్రులు మాత్రమే ఉన్నారన్నారు.