కొత్తగా 10 లక్షల పింఛన్లు.. ఆగస్టు 15 నుంచే పంపిణీ

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్‌ సమావేశం జరిగింది. దాదాపు 5 గంటలకు పైగా సాగిన ఈ కేబినేట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా మరో 10 లక్షల పింఛన్లు ఇస్తామని ఇటీవల ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై కేబినేట్ లో తీర్మాణం చేశారు. ఆగస్టు 15 నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈనెల 21న నిర్వహించాల్సిన శాసనసభ సమావేశాలను రద్దు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 5,111 అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టులు భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే :

  •  గ్రామ కంఠంలో ఇళ్ల నిర్మాణం, ప్రజా సమస్యలపై కమిటీ వేయాలని నిర్ణయం. సమస్యల పరిష్కారంపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలి.  
  •  కోఠిలో ఈఎన్‌టీ ఆసుపత్రికి 10 స్పెషలిస్టు వైద్య పోస్టులు మంజూరు. ఆసుపత్రిలో సౌకర్యాలతో ఈఎన్‌టీ టవర్‌ నిర్మించాలని నిర్ణయం.  
  •  వికారాబాద్‌లో ఆటోనగర్‌ నిర్మాణానికి 15 ఎకరాలు కేటాయింపు.  
  •  తాండూరు మార్కెట్‌ కమిటీకి యాలాలలో 30 ఎకరాలు కేటాయింపు.  
  •  షాబాద్‌లో బండల పాలిషింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో 45 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం.  
  •  ఈనెల 16న రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలి.  
  •  సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనల తయారు చేయాలని మంత్రి వర్గం ఆదేశించింది.