టీఆర్ఎస్ బలం పెంచిన మునుగోడు

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..  పార్టీకి, పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేయడంతో.. తెలంగాణలో మరో ఉప అనివార్యం అయిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికలే పునాదిగా తెలంగాణలో బీజేపీ బలపడుతూ వస్తోంది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు ఆ పార్టీకి బూస్ట్ నిచ్చాయి. మధ్యలో గ్రేటర్ ఎన్నికల్లోనూ గ్రేట్ ఫలితాలు సాధించింది.

ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన ఊపులో అసెంబ్లీ ఎన్నికలకు పోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ప్లాన్ లో కమలనాథులు ఉన్నారు. అందుకే పక్కా ప్లాన్ తో రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేశారు. అయితే బీజేపీ కంటే టీఆర్ఎస్ కే మునుగోడు ఉప ఎన్నిక కలిసొచ్చేలా ఉందని తాజా పరిణామాలని గమనిస్తే అర్థమవుతోంది.

మునుగోడు ఉప ఎన్నికలో ఏ గట్టున ఉండాలో కామ్రెడ్స్ తేల్చుకున్నారు. టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. అంతేకాదు.. శుక్రవారం మునుగోడులో  ప్రజాదీవెన పేరుతో టీఆర్ఎస్ నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ తో కలిసి వేదికను పంచుకున్నారు. బీజేపీ లాంటి మతతత్వ పార్టీని ఎదుర్కోవాలంటే టీఆర్ఎస్ తో కలిసి పని చేయాల్సిందేనని కామ్రెడ్స్ ప్రకటించారు. ఈ స్నేహం చిరకాలంగా కొనసాగుతోంది. వచ్చే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లోనూ కలిసి పని చేస్తామని సీఎం కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు.

ఇప్పటికే ఎంఐఎం టీఆర్ఎస్ కు చిరకాల మిత్రపక్షంగా కొనసాగుతోంది. ఇప్పుడు వారికి వామపక్షాల మద్దతు దొరికింది. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోయిన టీఆర్ఎస్ కు పోయేది ఏమీ లేదు. అది గులాబీ పార్టీ సిట్టింగ్ స్థానం కాదు. అయితే ఈ ఉప ఎన్నికలో పోరాడుతున్న క్రమంలో కేసీఆర్ కు కొత్త దోస్తులు దొరకడం శుభ పరిణామం. అందుకే మునుగోడు టీఆర్ఎస్ బలం పెంచుతుందని ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.