కేసీఆర్ ను లైట్ తీసుకున్న అమిత్ షా

ఫ్రీ ప్రమోషన్ కు బీజేపీ దూరంగా ఉంటుంది. తాజాగా మునుగోడు సభలో అమిత్ షా ప్రసంగంతో ఈ విషయంలో మరింత క్లారిటీ వచ్చింది. రెచ్చగొట్టినా.. ఆ పార్టీ రెచ్చిపోవడం లేదు. కూల్ గా తమ పని తాము చేసుకుపోతున్నారు.

తాము చెప్పాల్సిన విషయాలు చెబుతున్నారు. ఎప్పటిలాగే కేసీఆర్ సర్కార్ ను కుటుంబ పాలన అంటూ కడిగేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం నిలదీస్తున్నారు. కేంద్రం పథకాలు సరిగ్గా అమలు చేయడం లేదు. కేంద్రం ఇచ్చిన పైసలు సరిగ్గా ఖర్చు చేయడం లేదంటూ ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ చేసేవన్నీ మోసాలే. టీఆర్ఎస్ మరోసారి గెలిస్తే.. దఌతుడు సీఎం కాదు.. కేసీఆర్ స్థానంలో కేటీఆర్ వస్తారు అంతే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మునుగోడులో అమిత్ షా ఇవే మాట్లాడారు. 

 తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక సెప్టెంబరు 17 విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహిస్తాం. తెరాస అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తామన్నారు.. ఇచ్చారా?. ప్రతి జిల్లాకు ఒక సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామన్నారు.. నిర్మించారా? పేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామన్నారు.. ఇచ్చారా? డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇవ్వకపోగా..కేంద్రం నిర్మించే మరుగుదొడ్లను కూడా కేసీఆర్‌ అడ్డుకుంటున్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ మాట నిలబెట్టుకున్నారా? మరోసారి తెరాస అధికారంలోకి వస్తే కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తారు తప్ప.. దళితుడిని ముఖ్యమంత్రి చేయరని అమిత్ షా అన్నారు.


నిన్నటి సభలో కేసీఆర్ నిలదీసిన కృష్ణా లో తెలంగాణ వాటాపై అమిత్ షా నోరు తెరవలేదు. వడ్ల కోనుగోలు.. ఇతర అంశాలను లేవనెత్తలేదు. అసలు నిన్నటి కేసీఆర్ మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే అమిత్ షా కంటే ముందు మాట్లాడిన కిషన్ రెడ్డి.. కేసీఆర్ మాటలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు గోకినా.. గోకకున్నా నో గోకుతా అన్నారు కేసీఆర్. అయితే నీకు గుల గుల పెడితే.. గోక్కో. మేము నిన్ను గోకం. సీబీఐ, ఈడీ అన్నది.. తమ స్వతంత్ర వ్యవస్థలు. వాటిని ఎవరి పైనా కేంద్రం ప్రయోగించదని చెప్పుకొచ్చారు. మొత్తానికి.. కేసీఆర్ ను బీజేపీ జాతీయ నాయకులు పట్టించుకోవడం లేదు. ఒకవేళ కేసీఆర్ ను పట్టించుకుంటే.. ఆయన పెద్ద నేత అవుతాడని భయపడుతున్నట్టు కనిపిస్తుంది.