ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ.. వెనుక రాజకీయం !
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత వద్దన్నా.. ఎంత దూరంగా ఉన్నా.. ఆయన పేరు రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంది. ఆయన బ్యానర్లు రాజకీయ వేదికలపై దర్శనమిస్తూనే ఉంటున్నాయి. కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలుస్తూనే ఉన్నాయి. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నారు తారక్. అయితే ఈసారి ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్ టీఆర్ ను కలవబోతున్నారు. మునుగోడు సభకు హాజరయ్యేందుకు వచ్చిన అమిత్ షా.. రాత్రి 7 :30 నిమిషాలకు శంషాబాద్ నోవాటెల్ లో తారక్ తో సమావేశం కానున్నారు.
ఇటీవల అమిత్ షా ఆర్ఆర్ఆర్ సినిమా చూశారని.. అందులో కొమరం భీమ్ గా తారక్ నటనకు ఆయన ఫిదా అయ్యారు. తారక్ ని కలిసి ప్రత్యేకంగా అభినందించాలని భావించారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అందుకే హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షాతో తారక్ భేటీ ఏర్పాటు చేశారు. అయితే పైకి అభినందన భేటీ అని చెబుతున్న లోపల పెద్ద రాజకీయం దాగి ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తెలంగాణలో బీజేపీ టీడీపీ మద్దతు కోరుకుంటుంది. మద్దతు ఇచ్చేందుకు చంద్రబాబు రెడీగా ఉన్నారు. కానీ అది సరిపోదు. తెలంగాణ టీడీపీ తరుపున స్టార్ క్యాంపైనర్ కావాలి. అది ఎన్ టీఆర్ అయితే బాగుంటుందని కమలనాథులు భావిస్తున్నారు. అంతేకాదు.. మొదట తెలంగాణ టీడీపీని ఆ తర్వాత ఏపీ టీడీపీని కూడా ఎన్ టీఆర్ చేతుల్లోకి తీసుకొచ్చి.. తన సామంత రాజుగా చేసుకోవాలనే వ్యూహంలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఎన్ టీఆర్ అప్పుడే బీజేపీ చేరినట్టు, తమ వాడు అన్నట్టు బీజేపీ నేతలు ఎన్ టీఆర్ కు స్వాగతం చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తారక్ ని తమవాడిగా ప్రమోట్ చేసుకుంటున్నారు.