కేసీఆర్‌ అవినీతి చిట్టా విప్పబోతున్న అమిత్ షా ?

మునుగోడు వేదికగా తెలంగాణ రాజకీయం హీటెక్కుతున్నది. నిన్నటి ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కృష్ణాలో తమ వాటా తేల్చాలని డిమాండ్ చేశారు. తన ప్రశ్నలకు నేటి బీజేపీ సమరభేరి సభలో అమిత్ షా సమాధానం చెప్పాలన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ టీఆర్ ఎస్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.  భయంతో సీఎం నిన్న ఏం మాట్లాడారో ఆయనకే తెలియదని విమర్శించారు. మునుగోడు వేదికగా కేసీఆర్‌ నిన్న అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్తామన్నారు. మునుగోడులోనే కేసీఆర్‌ అవినీతి చిట్టా బయటపెడతామని సంజయ్‌ తెలిపారు.

మరోవైపు మునుగోడులో సభకు ముఖ్యఅతిథిగా పాల్గొనడానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్ చేరుకున్నారు. అమిత్‌షా పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత సాంబమూర్తి నగర్‌లోని సత్యనారాయణ అనే కార్యకర్త ఇంటికి వెళ్లి తేనీరు సేవించారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మునుగోడుకు బయలు దేరారు. సమరభేరి వేదికగా సీఎం కేసీఆర్ అవినీతిపై బండి సంజయ్ మాట్లాడుతారా ? లేక స్వయంగా అమిత్ షానే సంచనల ఆరోపణలు చేస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది.