కామ్రెడ్స్ .. ఈ లాజిక్ మరిచారా ?
వామపక్ష పార్టీలు పోరాటాలే ఊపిరిగా పని చేస్తాయి. ప్రజా ఉద్యమాలే.. ఆ పార్టీల జెండా, ఎజెండాలు. అయితే కనీసం నిరసన తెలిపేందుకు కూడా వీలు లేకుండా ధర్నా చౌక్ ను ఎత్తేసిన టీఆర్ఎస్ పార్టీకి కామ్రెడ్స్ మద్దతు ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి. మునుగోడు బీజేపీ సభలో కామ్రెడ్స్ నిర్ణయాన్ని ఈటల రాజేందర్ తీవ్రంగా తప్పుబట్టారు.
“సీపీఐ, సీపీఎం నేతల్లారా.. ఎనిమిదేళ్లుగా మీరు ఏనాడైనా ప్రగతిభవన్‌లో అడుగు పెట్టారా? మీ కార్మిక సంఘాలు సమ్మెలు చేసిన సందర్భంగా మిమ్మల్ని చర్చలకు పిలిచి సీఎం సమస్యలను పరిష్కరించారా? కమ్యూనిస్టు పార్టీలకు, ట్రేడ్ యూనియన్లకు అడ్డా ఇందిరాపార్కు. అలాంటి చోట ధర్నాలు చేసే అధికారం లేదని చెప్పి.. చైతన్యం ఉండకూడదని, ట్రేడ్ యూనియన్లు ఉండకూడదని చెప్పి నిషేధించిన కేసీఆర్.. ఈరోజు మీకు ప్రగతి కాముకుడిగా కనబడుతున్నారా? సీఎం తమ సమస్యల్ని పరిష్కరిస్తారని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే.. బ్రహ్మదేవుడు కూడా ఆర్టీసీని కాపాడలేరని కేసీఆర్ అన్నారు. ధర్నాచౌక్‌ని ఎత్తేసిన కేసీఆర్‌కు సీపీఐ మద్దతా?.. సిగ్గుచేటు” అన్నారు ఈటల. హుజూరాబాద్‌లో ఏం జరిగిందో మునుగోడులోనూ అదేజరుగుతుందన్నారు.