దారుణం : భర్తను కాల్చి చంపించిన భార్య
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గంగానగర్‌లో శనివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే అక్కసుతో తాళి కట్టిన భర్తనే ప్రియుడితో హత్య చేయించింది ఓ ఇల్లాలు. ఇంట్లో నిద్రిస్తున్న భర్తపై తుపాకీతో కాల్పులు జరిపించి దారుణానికి ఒడిగట్టింది.. సొంత మేనబావన్న కనికరం లేకుండా కళ్ల ముందే కట్టుకున్నోడి ప్రాణాలు తీయించింది.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటకు చెందిన రవళితో ఏడేళ్ల క్రితం కొరకొప్పుల రాజేందర్(28)కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఏడాదిన్నర వయసు. అయితే పెళ్లి అయినప్పటి నుంచి రాజేందర్‌కు రవళి దూరంగా ఉంటూ వచ్చింది రవళి. ఆమెకు మరో వ్యక్తితో సాన్నిహిత్యం ఉన్నట్లు గుర్తించిన భర్త అనేకసార్లు నిలదీశాడు. ఇటీవలే జరిగిన పంచాయితీలో.. ఇకపై కలిసి జీవిస్తామని ఆమె అంగీకరించింది.
తన తల్లిదండ్రులతో కలిసి ఉండటం రవళికి ఇష్టం లేకపోవడంతో రాజేందర్ పక్కనే వేరు కాపురం పెట్టాడు. ఆర్నెల్ల క్రితమే తండ్రి వారసత్వంగా సింగరేణి ఉద్యోగంలో చేరి శ్రీరాంపూర్ ప్రాంతంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం విధులకెళ్లివచ్చి రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నాడు. తెల్లవారుజామున పథకం ప్రకారం రవళి ఇంటి తలుపులు తెరిచిపెట్టింది. ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చారు. ఒకడు లోపలికి వెళ్లి రాజేందర్ కుడి కణతపై రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.