చిరు-సల్మాన్ కలిసొచ్చారు

రేపు (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. అయితే అభిమానులకు బర్త్ డే గిఫ్ట్స్ మాత్రం ఒకరోజు ముందుగానే అందుతున్నాయి. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘భోళాశంకర్’ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. తొలుత ఈ సినిమాను సెప్టెంబర్ 10 2022 రిలీజ్ చేయాలని భావించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. 2023 ఏప్రిల్ 14న భోళాశంక‌ర్ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేకర్స్ పకటించారు.

మరోవైపు మోహనరాజా డైరెక్షన్ లో మెగాస్టార్ నటిస్తున్న గాడ్ ఫాదర్ టీజర్ ను రిలీజ్ చేశారు. ‘20ఏళ్లు ఎక్కడకు వెళ్లాడో ఎవరికీ తెలియదు. సడెన్‌గా తిరిగి వచ్చిన ఆరేళ్లలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు’ అంటూ చిరంజీవి గురించి మురళీశర్మ వాయిస్‌తో టీజర్‌తో మొదలైంది. నయనతార, సత్యదేవ్‌, సముద్రఖని, బ్రహ్మాజీలు టీజర్‌లో కనిపించి అలరించారు. చివరిగా సల్మాన్‌ఖాన్‌ను ఉద్దేశిస్తూ ‘వెయిట్‌ ఫర్‌ మై కమాండ్‌ బ్రదర్’ అంటూ చిరంజీవి పలికిన సంభాషణ మెప్పిస్తోంది. ‘లూసిఫర్‌’ రీమేక్‌గా ‘గాడ్‌ఫాదర్’ తెరకెక్కుతోంది. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.