ఐదో ఆర్థిక శక్తిగా భారత్
భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. తాజాగా బ్రిటన్‌ను దాటేసి ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా అవతరించింది. 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్.. బ్రిటన్‌ను దాటేసి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ‘బ్లూమ్‌బర్గ్’ కథనం పేర్కొంది. ఈ కథనం ప్రకారం 2021 చివరి నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 854.7 బిలియన్ డాలర్లుగా ఉండగా.. యూకే ఆర్థిక వ్యవస్థ 816 బిలియన్ డాలర్లు మాత్రమే.
సరిగ్గా దశాబ్దం క్రితం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ 11వ స్థానంలో ఉండగా.. బ్రిటన్ ఐదో స్థానంలో నిలిచింది. తాజాగా యూకేను దాటేసి భారత్ ఐదో స్థానానికి ఎగబాకడం విశేషం. భారత్ కంటే ముందు అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. బ్రిటన్‌ను దాటేసి మన దేశం ఐదో ఆర్థిక శక్తిగా అవతరించడంపై పలువురు పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.
“కర్మ సిద్ధాంతం పనిచేసింది. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతో కష్టపడి పోరాడి, త్యాగాలు చేసిన ప్రతి భారతీయుడి హృదయం ఈ వార్తతో ఉప్పొంగిపోతుంది. అంతేగాక, భారత్ గందరగోళంలో పడిపోతుందని భావించిన వారందరికీ ఇదో గట్టి సమాధానం” అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. “మన వలస పాలకులైన యూకేను అధిగమించి భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించడం గర్వించదగ్గ క్షణం” అని కొటక్ మహీంద్రా సీఈవో ఉదయ్ కొటక్ రాసుకొచ్చారు.