రాజగోపాల్ రెడ్డి రేటు రూ.22 వేల కోట్లు

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. తన రాజీనామాతోనే మునుగోడుకు నిధులు వస్తున్నాయి. పెండింగ్ లో ఉన్న అన్నింటిని ప్రభుత్వం క్లియర్ చేస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నారు. మరోవైపు  రాజీనామా చేస్తే ఎక్కడైనా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా ? అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అంతేకాదు.. రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం మునుగోడులో మండల స్థాయి నేతలతో ఆయన సమావేశం అయ్యారు.

రాజగోపాల్‌ రెడ్డిని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే.. దాన్ని ఆయన రూ.22 వేల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి ఓటేయొద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మునుగోడులో 97వేల ఓట్లు కాంగ్రెస్‌ పార్టీ ఆస్తి అని రేవంత్‌ రెడ్డి అన్నారు. అందరం కలిసి పనిచేస్తే ఎవర్నైనా పడగొట్టచ్చని చెప్పారు. మండల స్థాయి నాయకులు రోజుకు రెండు గంటలు సమయం కేటాయిస్తే విజయం కాంగ్రెస్‌దేనని విశ్వాసం వ్యక్తంచేశారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని  బీజేపీ చూస్తోందన్నారు.