నాసల్ వ్యాక్సిన్‌కు అనుమతి
భారత్ బయోటెక్ రూపొందించిన ముక్కు ద్వారా ఇచ్చే కరోనా చుక్కల మందుకు (నాసల్ వ్యాక్సిన్) అత్యవసర వినియోగ అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విటర్ ద్వారా వెల్లడించారు. 18 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు మంజూరైనట్లు తెలిపారు.
దేశంలో అనుమతి పొందిన తొలి నాసల్ వ్యాక్సిన్ ఇదే. కొన్ని మార్పులు చేసిన చింపాంజీ అడినోవైరస్ వెక్టార్ సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేశారు. ‘వాషింగ్టన్ యూనివర్శిటీ ఇన్ సెయింట్ లూయిస్’ భాగస్వామ్యంతో ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. ఈ టీకాను నాసికా రంధ్రాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది.