హెచ్‌సీఏ తప్పులేదు. పేటీఎం అద్భుతంగా పని చేసింది.. మరి తప్పెవరిది అజహర్ ?
భారత్-ఆసీస్ మ్యాచ్ కు సంబంధించి హెచ్‌సీఏ టికెట్ల విక్రయంపై వస్తున్న వార్తాలన్నీ ఆరోపణలే అన్నారు అజహరుద్దీన్. టికెట్ల విక్రయం బాధ్యతను పేటీఎంకు అప్పగించినట్టు తెలిపారు. టికెట్ల విక్రయంలో పేటీఎం అద్భుతంగా పనిచేసిందని ప్రశంసించారు. టికెట్లు ఆన్‌లైన్‌లోనే అమ్మామని.. బ్లాక్‌లో అమ్మలేదని చెప్పారు.
“టికెట్ల విక్రయాల్లో హెచ్‌సీఏ నుంచి ఎలాంటి పొరపాట్లు జరగలేదు. పేటీఎం ద్వారా టికెట్లు విక్రయించాం. బ్లాక్‌లో టికెట్లు అమ్మేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం. బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మతున్నారనే వదంతులు ఎలా వచ్చాయో తెలియదు. టికెట్ల విక్రయంపై దుష్ప్రచారం జరుగుతోంది. బ్లాక్‌లో టికెట్లు అమ్మారనే ప్రచారం అవాస్తవం. టికెట్ల విక్రయంలో హెచ్‌సీఏ ఎలాంటి తప్పూ చేయలేదు. ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మితే బ్లాక్‌లో ఎలా సాధ్యం? జింఖానా మైదానంలో జరిగిన ఘటనకు చాలా బాధపడుతున్నాం. క్షతగాత్రులకు హెచ్‌సీఏ తరఫున చికిత్స అందిస్తాం” అని అజహర్ అన్నారు.