రివ్యూ : కృష్ణ వ్రింద విహారి
చిత్రం : కృష్ణ వ్రింద విహారి
నటీనటులు : నాగశౌర్య, షెర్లీ సేథియా, రాహుల్ రామకృష్ణ, సత్య, వెన్నెల కిషోర్, రాధిక, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం : మహతి స్వర సాగర్
దర్శకత్వం : అనిష్ ఆర్ కృష్ణ
నిర్మాత : ఉషా ముల్పూరి
పక్కింటి కుర్రాడిలా కనిపించే నాగ శౌర్యకు రొమాంటిక్ ప్రేమ కథలు బాగా నప్పుతాయి. మరోసారి తనకి అచ్చొచ్చిన కథనే ఎంచుకుని సొంత నిర్మాణ సంస్థలో ‘కృష్ణ వ్రింద విహారి’ చేశారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంది చూద్దాం పదండీ.. !
కథ :
సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన కుర్రాడు కృష్ణాచారి (నాగశౌర్య) . ఇంట్లో కట్టుబాట్లు ఎక్కువ. కృష్ణాచారి తల్లి అమృతవల్లి (రాధికా శరత్‌కుమార్) అంటే ఆ ఊళ్లో తెలియనివాళ్లు ఉండరు. పల్లెటూరి నుంచి ఉద్యోగం కోసమని హైదరాబాద్ చేరుకుంటాడు కృష్ణాచారి. ఐటీ కంపెనీలో టెక్నికల్ ట్రైనర్‌గా చేరతాడు. అక్కడే మేనేజర్‌గా పనిచేసే వ్రిందా (షిర్లే సేథియా)ని చూడగానే ప్రేమలో పడతాడు. ఎలాగైనా ఆమెతో కలిసి జీవితం పంచుకోవాలనుకుంటాడు. కానీ, వ్రిందా ఓ సమస్యతో బాధపడుతుంటుంది. అందుకే పెళ్లికి నిరాకరిస్తుంది. ఆ సమస్యని దాచిపెట్టి పెళ్లికి పెద్దల్ని ఒప్పించేందుకు కృష్ణ ఎన్ని అబద్ధాలు ఆడాడు? పెళ్లి తర్వాత ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొన్నాడన్నది మిగతా కథ.
నటీనటుల ఫర్ ఫామెన్స్ :
కుటుంబ నేపథ్యం మినహా మిగతా అంతా మూమూలే. విరామానికి ముందు వచ్చే మలుపు, ద్వితీయార్ధమే సినిమాకి కీలకం.నాగశౌర్య, షిర్లే సేథియా, రాధికా శరత్ కుమార్ చక్కటి అభినయం ప్రదర్శించారు. వాళ్లు ఆయా పాత్రల్లో ఒదిగిపోయిన విధానం చాలా బాగుంది. నాగశౌర్య, షిర్లే సేథియా ట్రెండీగా కనిపిస్తూనే పాత్రల్ని పండించారు. రాధికా శరత్‌కుమార్ పాత్రని డిజైన్ చేసిన తీరు బాగుంది. అందులో ఆమె అంతే బలంగా ఒదిగిపోయారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రామకృష్ణ నవ్వించే బాధ్యతని తీసుకున్నారు. ద్వితీయార్ధంలో వీళ్లు పంచిన హాస్యం కీలకం. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. మహతి స్వరసాగర్ పాటలు గుర్తుంచుకునేలా కాకపోయినా తెరపై చూస్తున్నప్పుడు ప్రభావం చూపిస్తాయి. కెమెరా పనితనం బాగుంది. కథని అల్లిన విధానంలోనూ, హాస్యం జోడించడంలోనూ దర్శకుడు తనదైన ప్రభావం చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
- కామెడీ, నటీనటులు
- సెకండాఫ్
మైనస్ పాయింట్స్ :
- ఫస్టాఫ్
- రొటీన్ కథ
బాటమ్ లైన్ : కృష్ణ వ్రింద విహారి.. టైమ్ పాస్ కు ఢోకా లేదు