కేరళలో పీఎఫ్‌ఐ ధర్నా హింసాత్మకం

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)పై జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 15 రాష్ట్రాల్లో 93 ప్రాంతాల్లో సోదాలు జరిపి 106 మందిని అరెస్టు చేసింది. పీఎఫ్‌ఐ ప్రభావం అధికంగా ఉన్న కేరళలో 22 మందిని అదుపులోకి తీసుకుంది.

ఈ అరెస్టులకు నిరసనగానే కేరళలో పీఎఫ్‌ఐ శుక్రవారం హర్తాల్ నిర్వహించింది. 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే పలువురు ఆందోళనకారులు రోడ్లపైకి చేరి ధర్నా చేపట్టారు. తిరువనంతపురం, కొల్లాం, వయనాడ్‌, అలప్పుళా తదితర జిల్లాల్లో నిరసనకారులు ప్రభుత్వ బస్సులపైకి రాళ్లు విసిరారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కోజికోడ్‌లో 15ఏళ్ల బాలిక, కన్నూర్‌లో ఓ ఆటోడ్రైవర్‌ గాయపడ్డారు.