కేసీఆర్.. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ?
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో హైలెట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటించబోతున్నారు. అలాగని కేసీఆర్ టార్గెట్ కేంద్రం కాదు. రాష్ట్రమే. తెలంగాణే. కేసీఆర్ ఎప్పుడూ ఓ సామెత చెబుతూంటారు. “నవ్వేటోడి ముందు జారిపడేలా చేయవద్దు”అని . ఈ సారి ఇదే ఫార్ములాతో ఆయన తెలంగాణ ప్రజల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆ వ్యూహమే జాతీయ పార్టీ అని చెబుతున్నారు.
తెలంగాణ బిడ్డ జాతీయ రాజకీయాల్లోకి చక్రం తిప్పడానికి వెళ్తే మద్దతివ్వరా అనే ఓ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ముందు ముందు టీఆర్ఎస్ ఎత్తుకోనుంది. తెలంగాణ ఉద్యమం తరహా.. ఆ సెంటిమెంట్ ను రగిలించనుంది.
రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజా ప్వతిరేకతను కాకుండా…బీజేపీని జాతీయ స్థాయిలో ఎదుర్కొంటున్న తమ నేతకు తెలంగాణ ప్రజలు మద్దతివ్వాలన్న ఓ ఎజెండాను ముందుకు తెస్తారు. దీని వల్ల కేసీఆర్కు అంతిమంగా తెలంగాణలో లాభం జరుగుతుంది. తన పాలనపై.. అభివృద్ధిపై కన్నా.. కేసీఆర్కు నేషనల్ లెవల్లో పోరాడేందుకు మద్దతు అనే అస్త్రం ద్వారా తెలంగాణలో మరోసారి కేసీఆర్ పీఠం నిలపెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.