ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. ఆగస్టు 22 నుంచి ములాయం ఆసుపత్రిలోనే ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
1939 నవంబరు 22న ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లా సైఫై గ్రామంలో ములాయం జన్మించారు. 1967లో తొలిసారిగా యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైల్లో ఉన్నారు. 1989లో జనతాదళ్ పార్టీ నుంచి తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1992లో సమాజ్‌వాదీ పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. తన రాజకీయ జీవితంలో మొత్తంగా 10 సార్లు ఎమ్మెల్యే, 7సార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణశాఖ సహాయమంత్రిగానూ ఉన్నారు.