సినిమా అంటే ఇది.. ‘కాంతార’పై కంగనా రివ్యూ

కన్నడ సినిమా ‘కాంతార’ బాలీవుడ్ లోనూ సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. అక్కడ తొలివారంలో రూ. 15 కోట్లు కలెక్ట్ చేసింది. రోజు రోజుకి స్క్రీన్లు, కలెక్షన్ల సంఖ్య పెరుగుతూ పోతుంది. బాలీవుడ్ ప్రముఖులు కాంతార ను చూసి ఫిదా అవుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ప్రశంసల వర్షం కురిపించారు.

“కుటుంబసభ్యులతో కలిసి ఇప్పుడే ‘కాంతార’ చూశా. ఇప్పటికీ నా శరీరం వణుకుతూనే ఉంది. ఇదొక అద్భుతమైన అనుభవం. సాంప్రదాయం, జానపద కథలు, దేశీయ సమస్యల సమ్మేళనమే ఈ చిత్రం. రిషబ్‌ శెట్టికి హ్యాట్సాఫ్‌. రచన, దర్శకత్వం, నటన.. అన్నీ మరోస్థాయిలో ఉన్నాయి. ప్రకృతి అందాలను చూపించిన విధానం, యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉంది. సినిమా అంటే ఇది. ఇలాంటి చిత్రాన్ని తాము ఎప్పుడూ చూడలేదని థియేటర్‌లో ప్రేక్షకులు చెబుతున్నారు. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన టీమ్‌కు ధన్యవాదాలు. మరోవారం రోజులపాటు నేను ఈ అనుభూతిలోనే ఉంటాననిపిస్తుంది” అని కంగనా అన్నారు.