టీఆర్ఎస్ లో చేరిన రాపోలు

తెలంగాణ బీజేపీ నుంచి మరో నేత కారెక్కారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ బుధవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పార్టీ కండువా కప్పి రాపోలును తెరాసలోకి ఆహ్వానించారు.
2012లో కాంగ్రెస్ తరఫున రాపోలు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2018లో పదవీకాలం పూర్తి కావడంతో 2019లో ఆయన భాజపాలో చేరారు. తాజాగా బీజేపీకి రాజీనామా చేసి తెరాస గూటికి చేరారు. కేంద్ర ప్రభుత్వం నిర్వాకాలు భరించలేకే భాజపాను వీడి తెరాసలో చేరుతున్నానని ఈ సందర్భంగా రాపోలు వెల్లడించారు. ముఖ్యంగా చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.