నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు.. రెడ్‌ హ్యాండెడ్‌ !

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం. ఓటుకు నోటు తరహా మరో వ్యవహారం వెలుగు చూసింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో.. టీఆర్ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఢిల్లీకి చెందిన వ్యక్తులు రంగంలోకి దిగారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డిని పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించేందుకు ప్రయత్నించారు. వీరంతా నగర శివారులోని ఫామ్‌హౌస్‌లో పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన ముందస్తు సమాచారంతోనే ఈ ఆపరేషన్ ను నిర్వహించామని చెప్పడం..  తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారనే సమాచారం వచ్చిందని, ప్రలోభాల ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టామని తెలిపారు. ఫరీదాబాద్‌ ఆలయానికి చెందిన రామంద్ర భారతి. తిరుపతికి చెందిన సింహయాజీ అనే స్వామీజీ హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌తో కలిసి వచ్చారని చెప్పారు.