దారుణం : భార్యను కారుతో తొక్కించిన నిర్మాత
అక్రమ సంబంధాలు అనర్థాలకు దారి తీస్తాయి. తాజాగా ఓ నిర్మాత తన భార్యను కారుతో తొక్కిన దారుణ ఘటన ముంబైలోని అంధేరీలో చోటు చేసుకుంది. బాధితురాలి భర్త పేరు కమల్ కిశోర్ మిశ్రా. అతడు సినీ నిర్మాత. ఇటీవల ఓ రోజు భర్త ఇంట్లో కనిపించకపోవడంతో ఆమె వెతుక్కుంటూ పార్కింగ్ ప్రదేశానికి వచ్చింది. అక్కడ కారులో ఉన్న తన భర్త వెంట మరో మహిళ ఉండటాన్ని ఆమె గమనించింది. వెంటనే ఆగ్రహంతో భర్తతో గొడవకు దిగింది.
అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో ఎదురుగా ఉన్న భార్యను పట్టించుకోకుండా అతడు వేగంగా కారు నడిపాడు. దాంతో ఆమె తల, కాళ్లూచేతులకు గాయాలయ్యాయి. గాయపడిన భార్యను వదిలి అతడు పరారయ్యాడు. ఘటనాస్థలంలో ఉన్నవారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.